రాష్ట్ర సాధన ఉద్యమంలో నమోదైన అత్యధిక కేసులను ఎత్తివేశామని, టెక్నికల్ కారణాల వల్ల, సమాచార లోపం వల్ల ఏమైనా కేసులు మిగిలివుంటే వాటిని కూడా అతి త్వరలో ఎత్తివేస్తామని మంత్రులు శ్రీ నాయిని నరసింహా రెడ్డి, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీ కేటీఆర్ తెలిపారు.
ఉద్యమ కేసుల ఎత్తివేత అంశంపై ఈ రోజు సచివాలయంలో హోం మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు, తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి, హోం సెక్రటరీ రాజీవ్ త్రివేది, న్యాయ శాఖ సెక్రటరీ నిరంజన్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో కాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేసుల ఎత్తివేత మొదలుపెట్టామని, ఇప్పటికే కేసులు ఎత్తివేస్తూ 1138 జీవోలు జారీ చేసి వేలాది మంది ఉద్యమకారులకు ఉపశమనం కలిగించినట్టు సమావేశంలో డిజీపి తెలిపారు.
ఇంకొక 19 కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వంలో వివిధ దశల్లో ఫైళ్లు ఉన్నట్టు ఈ రోజు సమావేశంలో మంత్రులకు తెలిపారు. టెక్నికల్ కారణాల వల్ల, లేదా సమాచార లోపం వల్ల ఉద్యమ కేసులేమైనా మిగిలి ఉంటే వాటిని కూడా ఫార్మాలిటీస్ పూర్తి చేసి అతి త్వరలో ఎత్తివేయాలని మంత్రులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. రెండు వారాల్లో జరిగే తదుపరి సమావేశానికి వివిధ కారణాల వల్ల పెండింగులో ఉన్న ఉద్యమ కేసుల పూర్తి వివరాలతో రావాలని మంత్రులు డీజీపీని కోరారు.