మేము ప్రజలను నమ్ముకున్నాం..

ఏపీలో కాంగ్రెస్‌ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి ప్రజలు పదేండ్లు అవకాశం ఇచ్చారని చెప్పారు. ఇరుపార్టీలకు ఏండ్ల తరబడి అవకాశం ఇచ్చినా అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి ఆధారంగా తాము ఓట్లు అడుగుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు మంత్రి కేటీఆర్‌ సమాధానమిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కర్ణాటకను మోడల్‌గా చూపిస్తున్నారని, అక్కడ 5 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదన్నారు. కన్నడ రైతులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. కర్ణాటకకు వెళ్లి రైతుల పరిస్థితిపై ఆరా తీద్దాం సిద్ధమా అని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో కూడా 110 స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు రావని స్పష్టం చేశారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు డిమాండ్‌ ఎప్పటినుంచో ఉందని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తాము ప్రజలను నమ్ముకున్నామని.. పోల్‌ మేనేజ్‌మెంట్లను కాదన్నారు.

ప్రజా రవాణాకు ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద్‌ మెట్రోను పూర్తి చేసిందే తామని చెప్పారు. మైనార్టీల సంక్షేమానికి అధిక కేటాయింపులు చేశామన్నారు. మైనార్టీల కోసం ఏటా రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌ తరాన్ని పటిష్టం చేయాలనేది బీఆర్‌ఎస్‌ తాపత్రయమని చెప్పారు. కేంద్రానికి రూపాయి కడితే 46 పైసలు చెల్లిస్తున్నారని విమర్శించారు. మిగతా నిధులు వివిధ రాష్ట్రాల్లో రోడ్లకు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని, తీసుకున్నది ఎక్కువని చెప్పారు. తాము ప్రజలకు ప్రగతి నివేదికలు సమర్పిస్తున్నామని చెప్పారు.