ఔటర్ రింగురోడ్డు లోప‌లి త్రాగునీటి ప్రాజెక్టుల‌ రివ్యూ

5Jun 2018

త్వ‌ర‌లో ఓఆర్ఆర్ ప‌రిధిలో సెవ‌రెజీ మాస్ట‌ర్ ప్లాన్

* రింగురోడ్డు లోప‌లి త్రాగునీటి ప్రాజెక్టుల‌ను రివ్యూ చేసిన కేటీఆర్
* వాట‌ర్ గ్రిడ్, సెవ‌రెజీ మాస్ట‌ర్ ప్లాన్‌పై స‌మీక్ష‌
* సోష‌ల్ మీడియా ఫిర్యాదుల‌పై స్పందించే తీరుపై ప్ర‌శంస‌లు
* సెవ‌రెజీ మెరుగుద‌ల కోసం ఐఐఐటీ, టీహ‌బ్ ఔత్సాహికుల సాయం
* జ‌ల‌మండ‌లి అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రి కేటీఆర్

హాడ్కో, ఓఆర్ఆర్ ప్రాజెక్టు ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేసి, రోడ్డు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు త్వ‌ర‌త‌గ‌తిన పూర్తిచేయాల‌ని రాష్ట్ర మున్సిపల్ ప‌రిపాల‌న మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ‌. కె. తార‌క రామారావు అధికారుల‌ను ఆదేశించారు. హాడ్కో, ఓఆర్ఆర్‌తో పాటు ప‌లు అంశాల‌పై జ‌ల‌మండ‌లి ఎండీ, డైరెక్ట‌ర్లు, ఉన్నతాధికారుల‌తో బుధ‌వారం రోజున ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పైపులైను విస్త‌ర‌ణ కోసం త‌వ్విన రోడ్డు పున‌రుద్ద‌ర‌ణ‌ ప‌నుల‌పై ప్ర‌త్యేక‌ దృష్టి సారించాల‌ని అధికారులను ఆదేశించారు. అవ‌స‌ర‌మ‌యితే రాత్రివేళ‌ల్లో ప‌నులు చేప‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేయాల‌ని సూచించారు. అయితే జూన్ 15 నాటికి రోడ్డు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు పూర్తిచేయ‌నున్న‌ట్లు ఎండీ మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను త్వ‌ర‌త‌గ‌తిన ప‌రిష్క‌రిస్తున్నందుకు జ‌ల‌మండ‌లి అధికారుల‌ను అభినందించారు. రోడ్డు మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు జ‌రుగుతున్న తీరుపై ఎన్జీవోల‌తో ధ‌ర్డ్ పార్టీ త‌నిఖీలు చేయ‌డాన్ని ప్ర‌శంసించారు.

ప్ర‌ధాన న‌గ‌రంలో సెవ‌రెజీ మెరుగుద‌ల కోసం కృషి చేయాల‌న్నారు. న‌గ‌ర శివారు ప్రాంతాల‌కు సెవ‌రెజీ మాస్ట‌ర్ ప్లాన్‌ను రూపొందిస్తామ‌ని తెలిపారు. సెవ‌రెజీ మెరుగుద‌ల, నిర్వ‌హణ సాంకేతిక సాయంతో ప‌రిష్కారంలో, అవ‌స‌ర‌మ‌యితే ఐఐఐటీ, టీహ‌బ్ ఔత్సాహికుల స‌హాయం, సూచ‌న‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో మ్యాన్‌ హోళ్లలోకి పారిశుద్ద్య కార్మికులు ప్ర‌వేశించ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. కార్మికులు ర‌క్ష‌ణ‌ క‌వచాలు, జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నారో లేదోన‌ని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. నాలాల ప్రవ‌హించే మురుగునీటిని శుద్ది చేసేందుకు నాలాల వ‌ద్దే ఎప్టీపీలు నిర్మించాల‌ని, అందుకు కావాల్సిన‌ అంచ‌నాలు రూపొందిచాల‌ని అధికారులను ఆదేశించారు.

రిజ‌ర్వాయ‌ర్ల పైభాగం, ప్రాంగణాల్లో సోలార్ వ్య‌వ‌స్థ సాధ్య‌సాధ్యాల‌ను ప‌రిశీలించాల‌న్నారు. త‌ద్వారా విద్యుత్ ఖ‌ర్చు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని సూచించారు. ఓఆర్ఆర్ వాట‌ర్ గ్రిడ్, కేశ‌వ‌పూర్, ఘ‌న్‌పూర్ రిజ‌ర్వాయ‌ర్, గోదావ‌రి మంచినీటి వ్య‌వ‌స్థ‌లో ఏమైనా అవ‌రోధాలు ఉంటే రిపోర్టు రూపొందించి స‌మ‌ర్పించాల‌ని ఆదేశించారు.

జ‌లం-జీవం కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టికీ ఎన్ని ఇంకుడుగుంత‌లు నిర్మించారో అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. వాట‌ర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును ఏదో పేరుకు కాకుండా, పిల్లలు చూసి స్ఫూర్తిపొందే విధంగా నిర్మాణాలు చేప‌ట్టాలని ఆదేశించారు. జూలై నాటికి పార్కు నిర్మాణ ప‌నులు పూర్తిచేస్తామ‌ని మంత్రికి అధికారులు వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ఎండీ శ్రీ‌. ఎం.దాన‌కిషోర్, ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ‌. ఎం. స‌త్య‌నారాయ‌ణ‌, టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ డా. పీ.ఎస్. సూర్య‌నారాయ‌ణ‌, ప్రాజెక్టు-1 డైరెక్ట‌ర్ శ్రీ. ఎం.ఎల్లాస్వామి, ఫైనాన్స్ డైరెక్ట‌ర్ శ్రీ‌. వాసుదేవ‌నాయుడు, ప్రాజెక్టు-2 డైరెక్ట‌ర్ శ్రీ‌. డి. శ్రీ‌ధ‌ర్ బాబు, రెవెన్యూ డైరెక్ట‌ర్ శ్రీ‌. బి. విజ‌య్ కుమార్ రెడ్డి, ఆప‌రేష‌న్స్-2 డైరెక్ట‌ర్ శ్రీ‌. పి. ర‌విలు పాల్గొన్నారు.

Minister Sri KTR along with HMWS MD Sri Dana Kishore held a review meeting on various issues related to drinking water supply in Hyderabad city.