గుండ్లపోచంపల్లి, పాశమైలారం టెక్స్‌టైల్ పార్కులు, అపరెల్ పై హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్ అధికారులతో సమీక్షా సమావేశం

11May 2018

గుండ్లపోచంపల్లి, పాశమైలారం టెక్స్‌టైల్ పార్కులు, అపరెల్ పై హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్ అధికారులతో మంత్రి కేటీఆర్ ఇవాళ సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అపరెల్‌తో సంబంధం లేకుండా ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారికి అనుమతులు రద్దు చేయాలన్న ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పార్కులో తెలంగాణలో ఉన్న వివిధ హ్యాండిక్రాప్ట్ కళాకారులకు శిక్షణ ఇచ్చేలా ఒక శిక్షణా నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గుండ్లపోచంపల్లిలో అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి పరచాలన్నారు. పార్కు నిర్వహణ కోసం అవసరమైన కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తమని తెలిపారు. పాశమైలారం టెక్స్‌టైల్ పార్కులో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తమన్నారు. రాష్ట్రంలో చేనేత వస్ర్తాలకు వివిధ వర్గాల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తోందని.. కావునా ఈ దిశగా టెస్కో ద్వారా మరిన్ని అమ్మకాలు పెంచేలా ప్రజలకు చేనేత వస్ర్తాలు అందుబాటులో ఉండేలా టెస్కో వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలన్నారు. టెస్కో కేంద్రాలు పెంచడం, రీ బ్రాండింగ్ వంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్రా లూమ్స్ అప్‌గ్రేడేషన్ వంటి కార్యక్రమాలను మరింతగా లబ్ధిదారుల్లోకి తీసుకుని వెళ్లేందుకు అవసరమైన కమ్యూనిటీ కో ఆర్డినేటర్లను నియమించుకోవాలని మంత్రి పేర్కొన్నారు.