తాగునీటి సరఫరా, వేసవి ప్రణాళికపై జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష

30Mar 2018

వేసవిలో హైదరాబాద్ నగరవాసులకు నీటి కష్టాలు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కే తారక రామారావు తెలిపారు. గతంలోకన్నా ప్రస్తుతం నగర తాగునీటి సరఫరా సామర్థ్యం పెరిగిందన్నారు. మంగళవారం శాసనసభ కమిటీహాల్‌లో మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి నగర తాగునీటి సరఫరా, వేసవి ప్రణాళికపై జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి నగరానికి సరిపడా నీటి సరఫరా జరుగుతున్నదని, గత ఏడాదితో పోల్చితే 100 ఎంజీడీల నీటి సరఫరా సామర్థ్యం పెరిగిందని జలమండలి అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నీటి వనరుల నుంచి నగరంలో ఎక్కడికైనా నీటిని సరఫరా చేసేందుకు అవసరమైన ఇంటర్‌గ్రిడ్ కనెక్టివిటీ కోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మాస్టర్‌ప్లాన్‌లో నగర నీటి సరఫరా కోసం ఉద్దేశించిన రెండు భారీ రిజర్వాయర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మొత్తం నగరానికి అన్ని నీటి వనరుల నుంచి సుమారు 600 ఎంజీడీల నీటి సరఫరాకు అవకాశం ఉన్నదని చెప్పారు. సుమారు 120 బస్తీలకు వాటర్ ట్యాంకర్ రహిత నీటి సరఫరా చేసేందుకు రూ.15 కోట్లతో నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు పనులు చేపట్టామని జలమండలి ఎండీ దానకిశోర్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

వీటి ద్వారా 30వేల కుటుంబాలకు ఈ వేసవిలో నీటి కష్టాలు లేకుండా చూస్తున్నామన్నారు. శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన హడ్కో ప్రాజెక్టు పనుల్లో భాగంగా రోడ్డు తవ్వకాలపై ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే రోడ్ రీస్టోరేషన్ పనులు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ వేసవిలో నగరంలో సాధ్యమైనన్ని ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. జలం-జీవం కార్యక్రమంలో భాగంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్కును జూన్ మొదటి వారం నాటికి సిద్ధం చేస్తామన్నారు. వాన నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన జలం-జీవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమీక్షలో పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు