రాష్ట్రంలో 2014 జూన్ నుంచి ఆసక్తికరమైన పరిస్థితి నెలకొందని.. 2014లో 63 సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నాటుకున్నాయి. 2018లో చంద్రబాబు, రాహుల్ ఒక్కటైనా 75 శాతం సీట్లు టీఆర్ఎస్ సాధించింది. పంచాయతీ, జడ్పీ మండల ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించాం. జడ్పీల్లో నూటికి నూరు శాతం సీట్లు సాధించడం దేశంలోనే ఓ చరిత్ర. మున్సిపల్ ఎన్నికల్లో 130 సీట్లకు 122 సీట్లు సాధించడం ఇంకో చరిత్ర. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఓటు కారుకే అనే అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతోందన్నారు.
మున్సిపల్ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. ప్రతిపక్షాలు అడ్డుకోబట్టే ఎన్నికలు ఆలస్యమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి 8 వేల మంది నామినేషన్లు దాఖలు చేశారు. అదే కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారన్నారు. బీజేపీ ఎగిరెగిరి పడింది. ప్రత్యామ్నాయం తామేనని ఎగిసిపడింది. కానీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను దింపలేకపోయిందని ఎద్దేవచేశారు. టీఆర్ఎస్ విజయాన్ని అపహాస్యం చేస్తూ కొందరు నేతలు మాట్లాడుతున్నారు.. ఇది ఓట్లేసిన ప్రజలను అవమానపరచడమేనన్నారు. ఉత్తమ్ రాజకీయాలను విరమించుకుని ఇంట్లో కూర్చుంటే మంచిదని హితవు పలికారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమన్నారు. మున్సిపాలిటీలకు ఏడాదికి రూ.3 వేల కోట్లు వస్తాయని తెలిపిన మంత్రి ఇక పట్టణాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని వెల్లడించారు.
సామాజిక న్యాయాన్ని టీఆర్ఎస్ పాటించి చూపించింది. 57 శాతం మహిళలకు మున్సిపల్ పీఠాల్లో అవకాశమిచ్చాము .ఏడు శాతం ఎక్కువ ఇచ్చాము. మహిళా సాధికారికత కు పెద్ద పీట వేశాము. 58 శాతం బీసీలకు కేటాయించాము. ఏనాడూ రాజకీయంగా ప్రాతినిధ్యం దక్కని ఎంబీసీలకు అవకాశం కల్పించాం. జనరల్ సీట్లలో బీసీ ,ఎస్సీ, ఎస్టీలకు అవకాశం కల్పించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేలకు అభినందనలు. దేశంలో ఆదర్శవంతమైన మున్సిపాలిటీలుగా తెలంగాణ పట్టణాలు మారడం ఖాయం. ఇంతటి అఖండ విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శిరస్సు వహించి నమస్కరిస్తున్నా అన్నారు.