నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్

14Jun 2021

నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని పునః ప్రారంభించిన పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖ మంత్రి శ్రీ కేటీఆర్
• గత ఎడాది కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ద్వారా సుమారు 109 కోట్ల రూపాయల లబ్ది రాష్ట్రంలోని నేతన్నలకు చేకూరింది
• ఈ పథకం పునః ప్రారంభం ద్వారా సుమారు రాష్ట్రంలోని 34 వేల మంది నేతన్నలకు ప్రయోజనం
• చేనేత కార్మికుల వేతన వాటా 8 శాతానికి రెట్టింపు, పవర్ లూమ్ కార్మికుల వేతన వాటా 8శాతానికి సమానంగా ప్రభుత్వం వాటా అందిస్తుంది
May be an image of one or more people, people standing, people sitting and indoor
రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం “నేతన్నకు చేయూత” కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ప్రగతి భవన్ లో జరిగిన టెక్స్ టైల్ శాఖ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వామలు కావచ్చని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికుల పొదుపుకు అదనంగా ప్రభుత్వం తన వాటాను జమచేస్తుందన్నారు. చేనేత కార్మికుడు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను 16శాతాన్ని ప్రభుత్వం జమ చేస్తుందని, దీంతోపాటు మరమగ్గ కార్మికులు చేసే 8 శాతం వేతన వాటాకు సమానంగా మరో 8శాతం వాటాను ప్రభుత్వం జమచేస్తుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఉన్న సూమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10 వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు పథకం భరోసాను ఇస్తుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాకముందుకు కేవలం చేనేతలకే ఉన్న ఈ పథకాన్ని విస్తరించి పవర్ లూమ్ కార్మికులకు కూడా ఈ పొదుపు సౌకర్యం కల్పించామన్నారు. దీంతోపాటు గతంలో కేవలం సోసైటీల పరిధిలో ఉన్న చేనేతలకు ఈ పథకం ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క చేనేత కార్మికుడితో పాటు డైయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు మరియు ఇతర చేనేత పనివారు కూడా ఈ పథకంలో చేరవచ్చన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు చేనేతలకు ప్రభుత్వం జమచేసే వాటా కేవలం 8శాతమే అని, దీన్ని తాము రెట్టింపు చేసి 16 శాతానికి పెంచామని (కార్మికుడి పొదుపు రెట్టింపు) మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ పథకం కరోనా కాలంలో నేతన్నలకు ఎంతో ఉపయుక్తంగా నిలిచిందని, కరోనా పరిస్థితుల నేపథ్యంలో నేతన్నలు తమకు ప్రయోజనాలను నిర్ణీత లాకిన్ పిరియడ్ కన్నా ముందే పొందేలా వెసులుబాటు ఇచ్చామని దీంతో రాష్ట్రంలోని నేతన్నలకు సూమారు 109 కోట్ల రూపాయల మేర లబ్ది కలిగిందన్నారు. ఇంతటి ప్రయోజకరమైన పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలని నేతన్నలు కోరిన నేపథ్యంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని, ఈరోజు పథకం కొసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కొనసాగించేందుకు అవసరం అయిన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వ కట్టుబడి ఉన్నదన్న మంత్రి కేటీఆర్, ఈ నేతన్నకు చేయూత పొదుపు పథకంలో నేతన్నలంతా చేరాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో టెక్స్ టైల్ శాఖ సెక్రటరీ శైలజా రామయ్యార్, టెక్స్ టైల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.