నేరెళ్ల బాధితులను పరామర్శించిన కేటీఆర్

9Aug 2017

మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం ఇసుక దందాను ప్రభుత్వం ప్రోత్సహించదు కాంగ్రెస్ హయాంలోనే ఇసుక దందా రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాల ఆరోపణలు విచారణ ఆధారంగా.. బాధ్యులెవరైనా చర్యలు తప్పవు ప్రజల నుంచి దూరం చేయలేరు..
వారి ఆశీర్వాదంతోనే మంత్రి స్థాయికి ఎదిగాను నేరెళ్ల ఇసుక లారీల దహనం కేసు బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన 8 మంది వేములవాడలోని మనోహర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం కేటీఆర్ వేములవాడకు చేరుకుని బాధితులను పరామర్శించి.. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నేరెళ్ల ఘటన, బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇసుక మాఫియాను ప్రభుత్వం ప్రోత్సహించదు అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మూడేళ్ల పాలనలో ఇసుక ద్వారా రూ. వెయ్యి కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక దందా నడిచిందన్నారు. బాధితులను పరామర్శించకుండా.. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాంగ్రెసోళ్ల తిట్లను దీవెనలుగా భావిస్తామన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్.
మిడ్ మానేరులో 10 టీఎంసీల నీరు నింపాలనే లక్ష్యంతోనే ఇసుకను తీస్తున్నామని స్పష్టం చేశారు. పలు రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం నేరెళ్ల ఘటనను వాడుకుంటున్నాయని ధ్వజమెత్తారు. మీడియా కూడా ఇటువంటి విషయాల్లో సంయమనం పాటించాలని సూచించారు. పోలీసులు తమను హింసించారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనపై డీఐజీ విచారణ జరుగుతుందని మంత్రి తెలిపారు. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులెవరైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. బాధితులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని చెప్పారు.
ప్రజలను నాకు దూరం చేయలేరు
సిరిసిల్ల ప్రజలను తనకు దూరం చేయలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. తనకు ప్రజలకు మధ్య దూరం పెంచేందుకు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి తనను దూరం చేయలేరు.. మీరు టూరిస్టులు మాత్రమే అని తెలిపారు. ఎప్పటికీ నియోజకవర్గాన్ని పట్టుకుని ఉండేది తానేనని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి స్థాయికి ఎదిగానని కేటీఆర్ చెప్పారు. వారికి ఏ కష్టం వచ్చినా వారి వెంటే ఉంటానని స్పష్టం చేశారు కేటీఆర్.