న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం: కేటీఆర్

16Oct 2018

న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

న్యాయవాదుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను మానిఫెస్టోలో పొందుపరచాలని మంత్రి శ్రీ కేటీ రామారావుని కలిసి ఈ రోజు న్యాయవాదులు కోరారు. తెలంగాణ బార్ కౌన్సిల్ మెంబర్ లతోపాటు తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈరోజు మంత్రి శ్రీ కేటీ రామారావు ని హైదరాబాద్ లో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయవాదుల సంక్షేమం కోసం ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిందన్న న్యాయవాదులు, రానున్న ఎన్నికల మానిఫెస్టోలో మరిన్ని అంశాలు చేర్చాలని ఈ సందర్భంగా మంత్రికి పలు వినతులు చేశారు. తెలంగాణ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ కి మరిన్ని అదనపు నిధులు ఇవ్వడంతో పాటు, ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి హెల్త్ కార్డులు మంజూరు, తెలంగాణ బార్ కౌన్సిల్ కి ప్రతి ఏడాది కొన్ని నిధుల గ్రాంట్, న్యాయవాదులకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా కల్చరల్ మరియు అకాడమిక్ భవన నిర్మాణానికి హామీ, న్యాయవాదులకు హౌసింగ్ కోసం ప్రత్యేక పథకాన్ని రానున్న మేనిఫెస్టోలో చేర్చాలని ఈ సందర్భంగా న్యాయవాదులు మంత్రి కేటీఆర్ ను కోరారు. ఇప్పటికే ప్రభుత్వం న్యాయవాదుల సలహాలు సూచనల మేరకు అనేక కార్యక్రమాలను ఈ దఫా చేపట్టిందని, రానున్న ప్రభుత్వం కూడా న్యాయవాదుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి న్యాయవాదులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశం సందర్భంగా న్యాయవాదులు సూచించిన కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో కమిటీ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. త్వరలో ప్రకటించే బోయే పూర్తిస్థాయి పార్టీ మేనిఫెస్టోలో న్యాయవాద సంక్షేమానికి సంబంధించిన సవివరమైన వివరాలు ఉండేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా న్యాయవాద సంక్షేమం పైన రూపొందించిన వినతి పత్రాలను మంత్రి కేటీఆర్ కి అందజేశారు.