బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఒక అధ్యయన కమిటీ: మంత్రి శ్రీ కేటీఆర్

18Jun 2018

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఒక అధ్యయన కమిటీ: మంత్రి శ్రీ కేటీఆర్
– ఈ కమిటీలో ఉండనున్న ఇందన, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మైన్స్, టీఎస్‌ఎండిసి, సింగరేణి అదికారులు
– నెల రోజుల్లో నివేధిక ఇవ్వనున్న కమిటీ
– ఇందన శాఖ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డితో కలిసి ఉన్నత స్ధాయి ఉమ్మడి సమావేశం
– బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్న మంత్రులు
– రాష్ర్ట పునర్విభన చట్టంలో పెర్కోన్న మేరకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన భాద్యత కేంద్రం పైన ఉన్నదని, కానీ గత నాలుగు సంవత్సరాలుగా కాలం వెళ్లదీస్తున్నది తప్ప కేంద్రం ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు

– ఏవిధంగా చూసిన బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుకు అనేక సానుకూలాంశాలున్నాయని, కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయమే అన్న మంత్రులు

– బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా, రాకున్నా ప్లాంటు ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుంది

బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీ కెటి రామారావు తెలిపారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హమీ మేరకు బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ రోజు ఇందన శాఖ మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి తో కలిసి బేగంపేట క్యాంపు కార్యాలయంలో ఒక ఉన్నత స్ధాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ గనుల శాఖ, టీఎస్‌ఎండిసి, సింగరేణి ఉన్నతాధికారులు హాజరై ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్న నేపథ్యంలో ప్లాంట్ ఏర్పాటుకు అవసరం అయిన అధ్యయనాన్ని చేసేందుకు మైన్స్, టీఎస్‌ఎండిసి సింగరేణి అధికారులు, ఇందన, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శులతో ఒక కమీటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈ కమీటీకి అధ్యయానానికి స్టీల్ ప్లాంట్ల ఏర్పాట్లతో అనుభవం ఉన్న కన్సల్టెంట్ కంపెనీతో పాటు అవసరం అయిన ఇతర శాఖల అధికారులు ఉంటారని మంత్రి తెలిపారు. ఈ కమీటీ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోపాటు భూమి అందుబాటు, ప్లాంటుకు అవసరం అయిన నీరు, బొగ్గు, విద్యుత్తు వంటి కీలక మైన అంశాలపైన సవివరమైన నివేధికను ఇస్తుందని తెలిపారు. ఈ కమీటీ నెల రోజుల్లో తమ అధ్యయనం పూర్తి చేస్తుందని, కమిటీ నివేదిక ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంటు ఏర్పాటుపైన ముందుకు వెలుతుందన్నారు. స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు గతంలోనే ముఖ్యమంత్రి శాసనసభలో హమీ ఇచ్చారని ఈ సందర్భంగా మంత్రులు కెటి రామారావు, జగదీశ్ రెడ్డిలు గుర్తు చేశారు. రాష్ట్ర పునర్విభన చట్టంలో పెర్కోన్న మేరకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిన భాద్యత కేంద్రం పైన ఉన్నదని, కానీ గత నాలుగు సంవత్సరాలుగా కాలం వెళ్లదీస్తున్నది తప్ప కేంద్రం ఏలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రభుత్వం తరపున అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంతోపాటు నేరుగా పలుమార్లు కలిసి విన్నవించామన్నారు. అయితే బయ్యారంలో అందుబాటులో ఉన్న ఇనుము నాణ్యత పేరుతో మెళిక పెడుతున్నారని, దశాబ్దాల కిందటే ఏలాంటి ఇనుము నిక్షేపాలు, బొగ్గు లేని వైజాగ్ లో ప్లాంటు ఏర్పాటు చేయడం, అది విజయవంతంగా నడుస్తుందన్నారు. బయ్యారం ప్లాంట్ ఏర్పాటుకి అవసరం అయిన అన్ని విధాలుగా సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉన్నదని, ఇప్పటికే ఒరిస్సాలోని బైలాడిల్లా నుంచి ఇనుప ఖనిజం బయ్యారానికి తరలించేందుకు అవసరం అయిన రైలు మార్గ నిర్మాణంలో 50 శాతం రాష్ర్టం భరిస్తుందని కేంద్రానికి తెలిపామన్నారు. తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే ఈ ప్లాంటు ఏర్పాటు పైన ప్రభుత్వం నిబద్దతతో ముందుకు పొతుందన్నారు. ఏవిధంగా చూసిన బయ్యారంలో ప్లాంటు ఏర్పాటుకు అనేక సానుకూలాంశాలున్నాయని, కావాల్సింది కేంద్ర ప్రభుత్వ సానుకూల నిర్ణయమని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ కేంద్ర నిర్ణయం కోసం ఒత్తిడి తేస్తునే ఉన్నామన్నారు. బయ్యారం ప్లాంటు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా, రాకున్నా ప్లాంటు ఏర్పాటుపైన తెలంగాణ ప్రభుత్వం ముందుకే పోతుందని, ఈ మేరకు ఈరోజు ఏర్పాటు చేసిన కమీటీ పూర్తి స్ధాయి మార్గనిర్ధేశం చేస్తుందని మంత్రి కెటి రామారావు తెలిపారు.