వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలనీ ఆదేశించిన మంత్రి శ్రీ కేటీఆర్

11Mar 2020

హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ మహానగరంలోని పెండింగ్ పనులు, భవిష్యత్ ప్రణాళికలపై నేడు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంత్రులు శ్రీ కేటిఆర్, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ లు సమీక్ష చేశారు.

కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) రూపొందించిన వరంగల్ నగర మాస్టర్ ప్లాన్ కు నేడు కేటీఆర్ ఆమోదం తెలిపారు. 2020 నుంచి 2041 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ తో వరంగల్ మహానగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్ చేరుతుందని మంత్రి కేటిఆర్ అన్నారు.

వరంగల్ కు మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో 29 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ నాటికి దీనిని ప్రారంభించాలని మంత్రి కేటిఆర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మామునూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి కేటిఆర్ వెల్లడించారు.

వరంగల్ స్మార్ట్ సిటీ పనుల పురోగతిపై ప్రజా ప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వెంటనే నగరంలో వెయ్యి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, ఇవి కూడా ఈ దసరాలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో 250 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, మొదటగా ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో వెయ్యి టాయిలెట్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వరంగల్ కు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇందులో ముఖ్యంగా పేదల ఆత్మగౌరవ సూచికలైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 3900 మంజూరు చేశారని, వీటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. ఇందులో ఇప్పటికే 900 ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిని త్వరలో ప్రారంభించాలని సూచించారు. మిగిలిన 3000 ఇండ్లలో 2200 ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800 ఇండ్ల నిర్మాణం కొన్ని స్థానిక ఇబ్బందుల వల్ల ప్రారంభం కాలేదని, మంత్రి కేటిఆర్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకురావడంతో అక్కడ ఇండ్లు ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. దసరా నాటికి 3900 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుతం బడ్జెట్ లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధుల లోటు లేనందున, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తి చేసేందుకు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు.

కాళోజి కళాక్షేతం, ఏకశిలా పార్క్ నిర్మాణం, జంక్లన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.

పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ ప్లాన్, గ్రీనరీ ప్లాన్ , ఎనర్జీ ఆడిట్ పూర్తి చేసి తీసుకురావాలన్నారు. ఎనర్జీ ఆడిట్ లో భాగంగా నగరంలో తుప్పు పట్టిన స్తంబాలు, వంగిన స్తంబాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే తీసేసి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. నగరానికి మాస్టర్ ప్లాన్ మేరకు శానిటేషన్ ప్రణాళికలు సిద్ధం చేసి తీసుకురావాలన్నారు. బడ్జెట్ లో 10 శాతం పచ్చదనం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో గ్రీనరీ ప్లాన్ రెడీ చేయాలన్నారు. ఉన్న స్మశాన వాటికలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, కొత్త వాటికోసం స్థలాలు గుర్తించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.

ఈ నెల 16వ తేదీన మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాల మీద చర్చిస్తామని, అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలన్నారు.

ఈ సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి , మండలి సభ్యులు శ్రీ కడియం శ్రీహరి, ఎంపీ శ్రీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ తాటికొండ రాజయ్య, శ్రీ చల్లా ధర్మారెడ్డి, శ్రీ అరూరి రమేష్, శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి శ్రీ నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ శ్రీ మర్రి యాదవ రెడ్డి, వరంగల్ మేయర్ శ్రీ గుండా ప్రకాశ్ రావు మరియు అధికారులు పాల్గొన్నారు.

Image may contain: 4 people, indoor

Image may contain: 6 people, people sitting and indoor