వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కేటి రామారావు

30Mar 2018

వేములవాడ పట్టణంలో అడుగుపెట్టగానే టెంపుల్‌సిటీకి వచ్చామన్న భావన కలిగేలా అభివృద్ధిచేయాలని మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. వేములవాడను సమగ్రంగా అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధంచేయాలని ఆయన అధికారులను సూచించారు.

శనివారం ఆయన అసెంబ్లీ కమిటీహాల్‌లో వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీడీఏ) అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా సమగ్ర పట్టణాభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను సిద్ధంచేయాలని సూచించారు. టెంపుల్ అథారిటీ పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలను వేములవాడ పట్టణ అభివృద్ధితో అనుసంధానం చేయాలన్నారు. రాబోయే ఐదు నుంచి పాతికేండ్ల కాలంలో జరిగే అభివృద్ధిని, పెరిగే జనాభాను, ఆలయ భక్తుల సంఖ్యను అంచనావేసి దూరదృష్టితో ప్రణాళికకు రూపమివ్వాలని సూచించారు. వేములవాడ దేవాలయ డిజైన్లను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలిస్తారని చెప్పారు. భవనాలు, వంతెనలు, రోడ్ల వంటి సివిల్‌వర్క్స్‌లో నాటి చోళ-చాళుక్య కళావైభవానికి అద్దంపట్టాలని సూచించారు. రోడ్ల విస్తరణతోపాటు పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. గుడిని ఆనుకుని ఉన్న చెరువులోకి ఒక్కచుక్క మురికినీరు కూడా చేరకుండా పరిశుద్ధ జలాలతో కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ చెప్పారు.