వ్యవసాయశాఖ మంత్రి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

30Mar 2018

వ్యవసాయానుబంధ పరిశ్రమలు అత్యవసరం
-పంట ఉత్పత్తులకు అనుగుణంగా పరిశ్రమల ఏర్పాటు
-ప్రాసెసింగ్, ఎగుమతుల యూనిట్లకు ప్రోత్సాహం
-వ్యవసాయశాఖ మంత్రి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

వచ్చే ఏడాది నాటికి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి కోటి ఎకరాలు సాగులోకి వస్తుందని, పుష్కలంగా నీరు లభించడంతో వ్యవసాయంతోపాటు అనుబంధరంగాల్లో ఊహించనంత మార్పు వస్తుందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొన్నది. పంటల ఉత్పత్తులు అధికమవుతాయని దీనికనుగుణంగా అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అభిప్రాయపడింది. రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం, విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం అసెంబ్లీ సమావేశ మందిరంలో వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కే తారకరామారావు, టీ హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జీ జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమలతోపాటు కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ల్యాబ్‌లు, ప్యాకింగ్ ఉత్పత్తులకు అపార అవకాశాలు ఉన్నాయని, మల్టీ నేషనల్ కంపెనీలు, చైన్ రిటైల్ మార్కెట్‌తో పరిశ్రమలను అనుసంధానం చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు అందించాల్సిన సహకారం, మార్గదర్శకాల రూపకల్పనపై ఈనెల 24న మరోసారి భేటీ కావాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంటల విస్తీర్ణం, ఉత్పత్తి, స్థాపించాల్సిన పరిశ్రమలు, సామర్థ్యంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సబ్సిడీలు ఇవ్వడం, ప్రోత్సాహానికి ఇతర సహాయసహకారాన్ని అందించేందుకు స్లాబులవారీగా మార్గదర్శకాలను రూపొందించాలని ఉపసంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. వ్యవసాయఆధారిత పరిశ్రమల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధి దొరికి, రైతుల ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుంది. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించి పరిశ్రమల ఏర్పాటు, ఎగుమతులకు అనుకూలమైన పంటలు సాగుచేసేలా అవగాహన కల్పించాలని ఉపసంఘం నిర్ణయించింది.