IT & Industries Minister KTR held a review meeting on Special Food Processing Zones initiative.

30Jun 2021

IT & Industries Minister Sri KTR held a review meeting on Special Food Processing Zones initiative. Agriculture Minister Sri Singireddy Niranjan Reddy, Civil Supplies Minister Sri Gangula Kamalakar, Chief Secretary Somesh Kumar, Principal Secretary Jayesh Ranjan, and Senior officials from Industries Department participated.
May be an image of 5 people, people sitting, people standing and indoor
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం ఈరోజు టియస్ఐఐసి కార్యాలయంలో జరిగింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ గంగుల కమలాకర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తో పాటు పరిశ్రమలు, వ్యవసాయం, సివిల్ సప్లైస్ వంటి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు మరియు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతాలయిన మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు మొదలుకొని తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు ప్రాజెక్టుల నీటితో కళకళలాడుతున్నాయని, వ్యవసాయ రంగ అభివృద్ధి భారీగా పుంజుకుందని తెలిపారు. తెలంగాణ భారతదేశంలో రెండో హరిత విప్లవానికి నాంది పలికిందని, దీంతోపాటు మాంసం, పాల ఉత్పత్తి, మత్స్య రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. అయితే ప్రస్తుతం పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన డిమాండ్ ని మార్కెటింగ్ సదుపాయాలను క్రియేట్ చేయాలంటే భారీ ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మాత్రమే ఏర్పాటు చేయకుండా ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయడం ద్వారా, పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ సృష్టించే అవకాశం కలుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా పండుతున్న వరితో పాటు, తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న ఆయిల్ ఫామ్ వంటి నూతన పంటలను భవిష్యత్ అవసరాలను కూడా ఈ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో పరిగణలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణలో పండుతున్న పంటల తాలూకు ఫుడ్ మ్యాప్ ని తమ పరిశ్రమల శాఖ తయారు చేసిందని, ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పండేందుకు అవకాశాలు ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న కసరత్తును అధికారులు వివరించారు. ఒక్కో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కనిష్టంగా 225 ఎకరాలకు తగ్గకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఈ జోన్లలో విద్యుత్తు, రోడ్లు, తాగునీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ, కామన్ అఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పండుతున్న వరి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, వంట నూనెలు, పండ్లు-కూరగాయల ప్రాసెసింగ్, స్టోరేజ్, మార్కెటింగ్ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించి ప్రభుత్వం పిలిచిన ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ కి సుమారు 350 దరఖాస్తులు అందాయని, అయితే ఈ ఎక్స్ ప్రెషన్ అఫ్ ఇంట్రెస్ట్ గడువును మరింతగా పెంచి మరిన్ని కంపెనీలను భాగస్వాములను చేయాలని అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి స్థానిక రైతాంగం నుంచి ఇప్పటికీ పలు డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ జోన్లకు అవసరమైన భూసేకరణ వంటి అంశాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా చొరవ చూపించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
May be an image of 2 people, people sitting, people standing and indoor
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అద్భుతమైన అండ లభించిందని ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంతో పాటు దేశ ఆర్థిక ప్రగతి మరింతగా ముందుకు పోవాలంటే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్, డిమాండ్ కల్పించడం ద్వారానే సాధ్యం అవుతుందన్నారు. పరిశ్రమల శాఖ ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న ఈ ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ప్రతిపాదిత స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో రాష్ట్ర రైతాంగం యొక్క వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలు పెరుగుతాయని, వారి ఉత్పత్తులకు దీర్ఘకాలంలో లాభసాటి ధరలు లభిస్తాయన్న ఆశాభావాన్ని నిరంజన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం తయారుచేసే ఉత్పత్తులకు శాశ్వత డిమాండ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి ఈ రంగంలో భారీగా పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి గారి సంకల్పంతో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి చాలా పెరిగిందని, అందుకనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెంచడం కోసం ఈ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దాదాపు 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేవలం నాలుగు నెలల కాలంలోనే ఎఫ్.సి.ఐకు అందించడంలో ప్రతీ సంవత్సరం ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ఇబ్బందులను అధిగమించడానికి మిల్లింగ్ ఇండస్ట్రీకు ప్రోత్సాహం ఇచ్చేలా నూతన పాలసీ రూపొందించాలన్నారు. పారా బాయిల్డ్, స్టీమ్ మిల్లులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని అందుకనుగుణంగా ఈ జోన్లలో ఏర్పాట్లు చేయాలన్నారు. మిల్లింగ్ పెరిగితే చైనా లాంటి దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు.