మున్సిపాలిటీల పైన సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీ కేటీఆర్
మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల పైన సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి శ్రీ కేటీఆర్
ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేల ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాలను పురపాలక శాఖ నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీ కేటిఆర్ తెలిపారు. అయితే ఈ అవకాశం కేవలం నూతన మున్సిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలోనే మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. కొత్త మున్సిపాలిటీల్లోఎల్ఆర్ఎస్ అవకాశం పైన విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పురపాలక శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఎల్ఆర్ఎస్ గడువు సెప్టెంబర్ వరకు ఉన్నదని మంత్రి తెలిపారు. ఈ అవకాశం నూతనంగా ఏర్పడిన 43 నూతన మున్సిపాలిటీలకు అవకాశం కలుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు సంవత్సరాలలో మెజార్టీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉందన్న మంత్రి పట్టణాల సమగ్రాభివృద్దిపైన దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం అన్నారు. ఇప్పటికే భారీ ఎత్తున జనాభా పట్టణాలలో కేంద్రీకృతమైన నేపథ్యంలో వాటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఈ చట్టంలోని విధులు అధికారాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు పని చేయాలన్నారు.
ఈరోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల పైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీ నిరంజన్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, మరియు స్థానిక ఎమ్మెల్యేలు హజరయ్యారు. ఈసందర్భంగా కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించెలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, స్మశానాలు వంటి ప్రాథమిక అంశాలపైన శ్రద్ధ వహించాలని అధికారులకు సూచన చేశారు. దీంతోపాటు ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యంకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్లకు, చైర్మన్లకు ఆదేశాలిచ్చారు. టాయిలెట్స్, పుట్ పాత్ ల నిర్మాణాలు వేగంగా చేపట్టాలని సూచించారు.