ManaNagaram program at Nizampet, Kukatpally Constituency.

5Jun 2018

Hon’ble Ministers Sri KTR, Sri P. Mahender Reddy, MP Sri Malla Reddy, Mayor Sri Bonthu Rammohan, MLA Sri Madhavaram Krishna Rao Participated in Mana Nagaram programme at Nizampet.

జంట నగరాల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే విశ్వనగరం సాధ్యమవుతుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కూకట్‌పల్లి జోన్‌లోని నిజాంపేట కొలన్ రాఘవరెడ్డి హాల్‌లో మన నగరం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరై ప్రసంగించారు. పేదల బస్తీల నుంచి అధునాతన కాలనీల వరకు అన్నింటా సమగ్ర అభివృద్ధి ఉండాలన్నారు. విశ్వనగరం కావాలంటే అన్ని మౌలిక వసతులు ఉండాలన్నారు. ఒక్కరోజులోనే విశ్వనగరం ఏర్పాటు సాధ్యం కాదన్నారు.

నగరాన్ని తీర్చిదిద్దేందుకు ఏం చేయాలనేది అవగాహన కల్పనకు స్టాళ్లను ఏర్పాటు చేశామన్నారు. మంచి ఆశయం సంప్రదాయంతో జీహెచ్‌ఎంసీ మంచి కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు కేటీఆర్. వీధి కుక్కలు, దోమల సమస్యను నిర్మూంచాల్సిన అవసరం ఉంది. 2 వేల పైచిలుకు వీధి కుక్కలను నగరవాసులు దత్తత తీసుకున్నారని వెల్లడించారు. నగరంలో దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ చేపట్టే చర్యలతో పాటు ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచినీరు సంతృప్తకర స్థాయిలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని తెలిపారు. ప్రతి మనిషికి 150 లీటర్ల మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నామని చెప్పారు.

అసలు మంచినీరు లేని ప్రాంతాల్లో మొదట పనులు చేపడుతామన్నారు. రెండో విడతగా తక్కువ పరిమాణంలో నీరు ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటి లభ్యతను పెంపు చేస్తామని తెలిపారు. మూడో విడతగా పాత పైప్‌లైన్ల ఏరియాలను గుర్తించి వాటిని మార్చి కొత్త పైపులైన్లను ఏర్పాటు చేస్తామన్నారు. శివారు మున్సిపాలిటీలకు మంచినీరు అందిస్తున్నాం. మంచినీటి విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నామని తెలిపారు. 3 నెలల్లో 56 రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. రానున్న 40 ఏళ్లు ఇబ్బంది లేకుండా పైప్‌లైన్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.