MA&UD Minister KTR held a review on development & expansion works of nalas which will be taken up in GHMC limits.

21Sep 2021

MA&UD Minister KTR held a review on development & expansion works of nalas which will be taken up in GHMC limits. Special Chief Secretary Arvind Kumar, Smt Vijayalaxmi Gadwal, GHMC MAYOR , Deputy Mayor Smt Mothe Srilatha Shoban Reddy, GHMC Commissioner Lokesh Kumar & senior officials participated.
May be an image of 1 person, sitting and indoor
హైదరాబాద్ నగరంలోని నాలాల విస్తరణ, అభివృద్ధి కోసం ఒక సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టి, వాటిని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికలపై పలు ప్రాథమిక సమావేశాలు నిర్వహించిన మంత్రి కేటీఆర్, ఈరోజు నగరంలోని అన్ని జోన్లలో త్వరలో ప్రారంభించనున్న నాలాల అభివృద్ధి కార్యక్రమాలపైన ఈ సమావేశంలో చర్చించారు.
అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో దశాబ్దాలుగా నాలాలు కుంచించుకు పోయాయని, నాలాల బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా తాము సమగ్ర ప్రణాళికలతో ప్రత్యేక పని చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు ఒకేసారి కుండపోతగా కురుస్తున్నాయని, వీటివల్ల గతంలో ఎన్నడూ లేనివిధంగా నగరంలోని అనేక ప్రాంతాలు ముంపుకు గురవుతున్న నేపథ్యంలో ఈ నాలాల విస్తరణ, బలోపేతం అత్యంత ఆవశ్యకమైన కార్యక్రమంగా మారిందన్నారు. వరదల వలన భవిష్యత్తులో నగర పౌరులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్న ప్రాథమిక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమగ్రంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాలాల విస్తరణ వలన ప్రభావితమయ్యే పేదల విషయంలో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో వ్యవహరిస్తుందని, వీరిలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. నాలాలు, చెరువుల రక్షణ, అభివృద్ధి కోసం అవసరమైతే ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలతో నాలాల విస్తరణ పైన ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.
May be an image of 2 people, people sitting and indoor
త్వరలో చేపట్టనున్న నాలాల అభివృద్ధి పైన జోనల్ కమిషనర్లు ఈ సమావేశంలో మంత్రికి వివరాలు అందించారు. ఇప్పటికే ఆయా నాలాలలో ఉన్న అడ్డంకులు, నాలాల విస్తరణ, రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి అంశాలపైన క్షేత్ర స్థాయిలో తమ సిబ్బందితో సర్వే చేసి రూపొందించిన నివేదికల వివరాలను జోనల్ కమిషనర్లు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్. ఎన్.డి.పి కార్యక్రమంతో సమన్వయం చేసుకొని ముందుకుపోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మొదటి దశలో చేపట్టే నాలాల విస్తరణతోపాటు, ప్రతిసారి భారీ వర్షాల వలన వరదకు కారణం అవుతున్న బాటిల్ నెక్స్ ( నాలాలు బాగా కుంచించుకు పోయిన ప్రాంతాలను) గుర్తించి వాటిని విస్తరించే కార్యక్రమాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో నగర మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతె శ్రీలత శోభన్ రెడ్డి, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.