Minister KTR Attended an important meeting chaired by Smriti Zubin Irani Ji on Centre- State collaboration to promote Handloom & Handicrafts

2May 2018

తెలంగాణ ఆదర్శం

-చేనేత కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయం
-కేంద్ర జౌళిశాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరాని ప్రశంస
-మిగతా రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచన
-అన్ని రాష్ర్టాల జౌళిశాఖ మంత్రుల సమావేశంలో
-రాష్ట్ర కార్యక్రమాలను వివరించిన మంత్రి కేటీఆర్
-బడ్జెట్‌లో నేతన్నలకు 1270 కోట్లు కేటాయించినట్టు వెల్లడి

చేనేత కార్మికుల కోసం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని సంక్షేమ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అమలుచేస్తున్నదని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతిఇరాని అభినందించారు. దేశంలోని మిగతా రాష్ర్టాలు కూడా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని అనుసరించాలని, రాష్ట్రం మాదిరిగా చేనేత కార్మికుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రి స్మృతిఇరాని నేతృత్వంలో జరిగిన అన్ని రాష్ర్టాల జౌళిశాఖ మంత్రుల సమావేశంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేనేత, హస్తకళల రంగానికి ఊతమిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చేనేతరంగ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకుపోయేందుకు ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత పరిశ్రమ కోసం రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను, చేపట్టిన సంక్షేమ పథకాలను మంత్రి కేటీఆర్ వివరించారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.1270 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.

చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రెండు కార్పొరేషన్లను ఏర్పాటుచేశామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా నూలుకు, అద్దకాలకు సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికులకు వేతనాలు పెరిగే విధంగా 50 శాతం సబ్సిడీలో 35 శాతం కార్మికుడికి వేతనం చేరేలా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని చెప్పారు. చేనేత మగ్గాలు ఎక్కడ ఉన్నా.. వాటన్నింటికీ యూనిక్‌కోడ్‌ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సామాజిక భద్రత కోసం నేతన్నకు చేయూత అనే కార్యక్రమం ప్రవేశపెట్టామని.. నేత కార్మికుడు రూపాయి చెల్లిస్తే ప్రభుత్వం రెండురూపాయలిస్తుందని చెప్పారు. చేనేత కళాకారులు రూపొందించిన వస్ర్తాలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. జియో ట్యాగింగ్ ద్వారా చేనేత మగ్గాలను గుర్తించి, కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల కోసం చేపట్టిన వివిధ పథకాల గురించి మంత్రి కేటీఆర్ వివరించడంతో కేంద్ర మంత్రి స్మృతిఇరానీ అభినందించారు. ఆయా పథకాల పూర్తి వివరాలు తీసుకోవాలని కేంద్ర జౌళిశాఖ అధికారులకు సూచించారు. నేత కార్మికుల సంక్షేమంలో తెలంగాణ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి: కేటీఆర్
దేశవ్యాప్తంగా చేనేత కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో కోరారు. ప్రస్తుతం జీఎస్టీ పేరుతో అనేక శ్లాబుల కింద 5, 10, 18 శాతం వసూలు చేస్తున్నారని, వాటన్నింటినీ ఒకే శ్లాబ్ పరిధిలో 5 శాతానికి తేవాలన్నారు. అదేవిధంగా తెలంగాణలో 14 చేనేత క్లస్టర్లను ఏర్పాటుచేయాలని కేంద్ర మంత్రికి సూచించారు.

ప్లీనరీ వేదికగా అన్ని అంశాలు ప్రస్తావిస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదని, అసెంబ్లీ వేదికగా సమస్యలు చర్చిద్దామంటే పారిపోతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు చేరుతున్నాయని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో తెలియడం లేదని ఆయన మీడియా సమావేశంలో ఎద్దేవా చేశారు. ప్లీనరీ వేదికగా అన్ని అంశాలను ప్రస్తావిస్తామన్నారు. జీఎస్టీ ఒకే శ్లాబు కిందకు తప్పకుండా తెస్తామని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ చెప్పారని మంత్రి కేటీఆర్ తెలిపారు. చేనేత క్లస్టర్ల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించారన్నారు.

బీమా ప్రతిపాదన గొప్ప ఆలోచన: మంత్రి కేటీఆర్‌కు వీవర్స్ ఫౌండేషన్ కృతజ్ఞతలు
దేశంలోని చేనేత కార్మికులందరికీ ఉచిత ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రతిపాదించడం గొప్ప ఆలోచన అని, తెలంగాణ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో చేనేతవర్గాల పక్షాన పనిచేస్తున్నదని వీవర్స్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.