Minister KTR held a review meeting on the rejuvenation & river-front development works of Musi river

27Jul 2018

Minister KTR held a review meeting on the rejuvenation & river-front development works of Musi river. 

మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి ప్రణాళికలను, వాటికి సంబంధించిన కార్యచరణను అధికారులు మంత్రి కేటీ రామారావుకి తెలియజేశారు. ఇప్పటికే మూసినది సుందరీకరణ తాలూకు డిజైన్లను పలు అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ సంస్థలు తయారు చేస్తున్నారని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి తెలియజేశారు. ఒకవైపు డిజైన్లతో పాటు అభివృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకుపోతూనే, ప్రస్తుతం మూసీనదిలో సుదీర్ఘ కాలంగా పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యకలాపాలను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రికి అధికారులు తెలిపారు. ఈమేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోపాటు జిహెచ్ఎంసి కలిసి మూసి నది ఒడ్డున ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మూసీనది ప్రాంతంలో ఉన్న ఆక్రమణలను గుర్తించేందుకు త్వరలోనే హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నది. దీంతో పాటు అనేక సంవత్సరాలుగా ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకి సరైన విధంగా పునరావాసం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ఒక నివేదికను తయారు చేయనున్నట్లు తెలిపారు. జీవనాధారం కోసం మూసి ఒడ్డున తాత్కాలిక గృహాల్లో నివసిస్తున్న పేదలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాంబే, జెఎన్ఎన్ యుఆర్ఎం ఇళ్లలో పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవైపు ప్రస్తుతం ఉన్న మూసి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడుకోవడానికి గుర్తించిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు జిహెచ్ఎంసి అధికారులు నిరంతరం నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు పలు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. త్వరలోనే ఈ కార్యక్రమాల తాలూకు పనులు ప్రారంభం కానున్నాయి.