Minister KTR held a review meeting with the HoDs of IT and Industries departments at the MCRHRD institution

12Feb 2020

Minister KTR held a review meeting with the HoDs of IT and Industries departments at the MCRHRD institution in Hyderabad. Principal Secretary Jayesh Ranjan was present in the meeting.

Image may contain: 7 people, people sitting and indoor

తెలంగాణ ప్రభుత్వ విధానాలతో అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రానికి పెద్దఎత్తున వస్తున్న పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విధానాలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. మరిన్ని కంపెనీలకు అవసరమైన మౌలిక వసతుల రూపకల్పన, ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని పరిశ్రమలశాఖ అధికారులను ఆదేశించారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ఐటీ, పరిశ్రమలు, టెక్స్‌టైల్‌శాఖల కార్యకలాపాలపై బుధవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ రంగాల్లో టీఎస్‌ఐఐసీ, ప్రభుత్వం సిద్ధంచేస్తున్న పలు పారిశ్రామిక పార్కులు, ఇతర మౌలిక వసతుల కల్పన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Image may contain: 3 people, people sitting

రాష్ట్రంలోని బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్‌ వంటి ఫుడ్‌పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల వివరాలను అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పలు కంపెనీలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో తమ పెట్టుబడులపై అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.207 కోట్ల పెట్టుబడులను పెట్టిందని, సంగారెడ్డి జిల్లా గోవింద్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం తయారీప్లాంటును ఏర్పాటుచేస్తున్నదని తెలిపారు. అక్కడ ప్లాంటు నిర్మాణపనులు వేగంగా జరుగుతున్నాయని, దీనిద్వారా స్థానికంగా ఉన్న 4 వేల డెయిరీ రైతు కుటుంబాలకు ప్రయోజనం కలగడంతోపాటు దాదాపు 500 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఈ ప్లాంటు ద్వారా ప్రతిరోజు 100 మెట్రిక్‌టన్నుల ఐస్‌క్రీం తయారవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్‌నాటికి ప్లాంటు నిర్మాణం పూర్తయి ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు వరంగల్‌ నగరానికి తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ముందుకొచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. ఆ దిశగా ఇతర ప్రాంతాల్లోనూ ఐటీ పరిశ్రమకు అవసరమైన పార్కుల అభివృద్ధి, కన్వెన్షన్‌ సెంటర్ల ఏర్పాట్లపై దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. ఇంకా అనేక కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుకు సుముఖంగా ఉన్నాయని చెప్పారు. కరీంనగర్‌లో ప్రభుత్వం నిర్మించిన ఐటీ టవర్‌ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు తెలిపిన కేటీఆర్‌.. ఇక్కడ పలు కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయన్నారు.

నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మంలోనూ ఐటీ భవనాల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నదని అధికారులు తెలుపగా.. ఆయా భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకొచ్చిన కంపెనీలతో మాట్లాడి నిర్మాణాలు పూర్తికాగానే ఏర్పాటుచేసేలా చూడాలని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌కు సూచించారు. టీహబ్‌ రెండోదశ భవనం త్వరలోనే పూర్తవుతుందని, ఈ భవనం ప్రారంభం తర్వాత ఇది అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్‌ అవుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలో టీ వర్క్స్‌ ప్రారంభంతోపాటు ఈ ఏడాది జూలై లో అతిపెద్ద ప్రోటోటైపింగ్‌ సెంటర్‌ ఏర్పాటవుతుందని చెప్పారు. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుపై మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని, అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ మాణిక్‌రాజ్‌, చేనేత, జౌళిశాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ పాల్గొన్నారు