Minister KTR interacted with Municipal Commissioners of Hyderabad Urban Agglomeration
23Jul 2020
Minister KTR interacted with Municipal Commissioners of Hyderabad Urban Agglomeration
నగరాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పట్టణాలను అభివృద్ధి మరియు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు అన్నారు. ఇప్పటికే తెలంగాణలో సుమారు 40 శాతం పైగా పట్టణాల్లో నివసిస్తున్నదని, రానున్న ఐదారు సంవత్సరాల్లోనే రాష్ట్రంలోని మెజారిటీ జనాభా పట్టణాల్లో నివసించే అవకాశం ఉంటుందన్నారు. త్వరలోనే తెలంగాణ అత్యధిక మంది పట్టణ ప్రాంతాల్లో నివసించే ఒక అర్బన్ స్టేట్ గా మారుతుందన్నారు. ఈ మేరకు పెరుగుతున్న పట్టణీకరణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణం సుమారు 30 సంవత్సరాల కాల వ్యవధికి తన అవసరాలు తెలుసుకుని, ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటి నుంచి తన భవిష్యత్తు అవసరాల కోసం పట్టణ ప్రణాళికలు సిద్ధం చేసుకోకుంటే, భవిష్యత్తు అభివృద్ధి అంతా అసమగ్రంగా ఉంటుందని అన్నారు. పెరుగుతున్న జనాభాకు అవసరమైన సేవలను అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ మేరకు పరిపాలన వికేంద్రీకరణ ఒక సాధనంగా ఎంచుకున్నమని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటిదాకా పెద్ద ఎత్తున పరిపాలనా సంస్కరణలు తీసుకు వచ్చిన ప్రభుత్వం తమదని మంత్రి కేటీఆర్ తెలిపారు. జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు, గ్రామాల సంఖ్యను పెద్ద ఎత్తున పెంచి ప్రజల వద్దకు పరిపాలన తీసుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా పురపాలికల సంఖ్య దాదాపు రెట్టింపు చేసి 141 కి పెంచామన్నారు. నూతన పురపాలికలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి అవసరమైన నిధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన కార్పొరేషన్లు, హైదరాబాద్ పరిసర మున్సిపాలిటీల కమిషనర్లకు, జిల్లా అదనపు కమిషనర్లకు నిర్వహించిన ర్రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు సమావేశంలో పాల్గొని వారికి మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వేగంగా పట్టణీకరణ హైదరాబాద్ చుట్టు పక్కల పురపాలికల్లో, ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూరా జరుగుతుందని ఈ మేరకు అక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పురపాలిక తన ఆదాయ వనరుల విషయంలో ప్రత్యేక ఆడిట్ చేపట్టి రానున్న సంవత్సరాల్లో ఆదాయపు పెరుగుదలకు సంబంధించిన వినూత్నమైన ఆదాయ వనరు నిర్వహణ పద్ధతులను ఎంచుచుకోవాలన్నారు. పురపాలికలు తాగునీటి నిర్వహణకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉండాలని, ప్రతి పురపాలిక వాటర్ ఆడిట్ నిర్వహించుకొని సిద్ధంగా ఉండాలన్నారు. తద్వారా ఆయా పట్టణాలకు భవిష్యత్తు తాగునీటి అవసరాలు పైన స్పష్టత వస్తుందన్నారు. దీంతోపాటు ప్రతి పట్టణం తన ఎనర్జీ ఆడిట్ నీ సిద్ధం చేసుకుని ఉండాలి. ప్రతి పట్టణం పారిశుద్ధ్య నిర్వహణను తమ ప్రాథమిక విధిగా తీసుకుని అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలు దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.