30Mar 2018
అన్ని వర్కింగ్ ఏజెన్సీలు వేగంగా పనిచేయాలి
-సమీక్షలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
-ప్రభుత్వం నుంచి అన్నిరకాల సాయం అందిస్తాం
-గడువులోపు పూర్తిచేస్తే ప్రోత్సాహాకాలిస్తామని హామీ
ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత గడువులోపు మిషన్ భగీరథ (అర్బన్) పనులను పూర్తికావాలని పురపాలకశాఖ మంతి కల్వకుంట్ల తారకరామారావు అధికారులు, వర్కింగ్ ఏజెన్సీలను ఆదేశించారు. మిషన్ భగీరథ అర్బన్ పనుల పురోగతిని సీడీఎంఏ కార్యాలయంలో శుక్రవారం మంత్రి కేటీఆర్ సమీక్షించారు. త్వరలో పనులు పూర్తయ్యే పట్టణాల జాబితాను రూపొందించడంతోపాటు ప్రతి పట్టణంలో ఏయే తేదీలోపు పనులు పూర్తవుతాయో తెలుపాలని సూచించారు. అమృత్ పథకం కింద ఉన్న పట్టణాల్లో పనులు జరుగుతున్న తీరును మంత్రి సమీక్షించారు. గడువులోపు పనులు పూర్తయ్యేందుకు అవసరమయ్యే అన్నిరకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి వర్కింగ్ ఏజెన్సీలకు అందించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. గడువులోపు పనులు పూర్తిచేసే ఏజెన్సీలకు ప్రోత్సాహకాలను ఇస్తామన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. వచ్చే వర్షాకాలం నాటికి పనులను సేఫ్ స్టేజీకి తీసుకురావాలని సూచించారు
మణుగూరులో పనులు దాదాపుగా పూర్తయ్యాయని, ఆర్మూరులో 98 శాతం, సిరిసిల్లలో 80 శాతం పనులు ముగిశాయని అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. రాష్ట్రంలోని సగం పురపాలికల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే నాలుగైదు నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ఎక్కడైనా పనులు మందగించి ఉంటే, అక్కడి సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఆయా జిల్లా కలెక్టర్లతో చర్చించి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తారని మంత్రి చెప్పారు. త్వరలోనే మిషన్ భగీరథ (అర్బన్)పై వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులతో ఒక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని మంత్రి తెలిపారు. మిషన్ భగీరథ కార్యక్రమంపై ప్రతివారం సమీక్షను నిర్వహిస్తామన్నారు. మిషన్ భగీరథలో వేసే ప్రతి పైపులైను వెంబడి కచ్చితంగా ఆఫ్టిక్ ఫైబర్ డక్ట్‌ను వేయాల్సిందేనని వర్కింగ్ ఏజెన్సీలకు మంత్రి స్పష్టంచేశారు. ఫైబర్‌గ్రిడ్ ప్రభుత్వ ప్రతిష్ఠ కార్యక్రమమని గుర్తుంచుకోవాలని సూచించారు. సమావేశంలో పురపాలకశాఖ ముఖ్యకార్యదరి అరవింద్‌కుమార్, ఈఎన్సీ (పీఈ) ధ న్‌సింగ్, శ్రీదేవి, వర్కింగ్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.