Minister KTR spoke at a webinar with the members of the European Business Group
20Oct 2021
IT and Industries Minister Sri KTR spoke at a webinar with the members of the European Business Group today. During the meeting, the Minister highlighted the progressive industrial policies and the existing investment opportunities in Telangana.
యూరోపియన్ దేశాల పెట్టుబడులకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపిన మంత్రి శ్రీ కేటీఆర్
యూరోపియన్ బిజినెస్ గ్రూప్ నిర్వహించిన సమావేశంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రసంగించారు. యూరప్ మరియు భారత దేశానికి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, రాయబార కార్యాలయాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ యూరోపియన్ వ్యాపార వాణిజ్య వర్గాలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటు ఇక్కడి వ్యాపార అనుకూలతలను వివరించారు. యూరప్ వ్యాపార వాణిజ్య వర్గాలను చేరుకుని, తెలంగాణ గురించి వివరించేందుకు సహకరించాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాల ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తెలంగాణ గురించి తమకు సానుకూల సమాచారం ఉందని, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పాలసీలు, ముఖ్యంగా అనుమతుల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైన సానుకూల ఫీడ్బ్యాక్ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రస్తావించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ – ఐపాస్ విధానం గురించి వివరించి, టీఎస్ – ఐపాస్ విధానంలో ఉన్న ప్రత్యేకతలను తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి చెందిన పెట్టుబడులకు అనుకూలమైన పాలసీలతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక వినూత్నమైన కార్యక్రమాలకు, దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న ప్రశంసలను వివరించారు. తాము చేపట్టిన టీఎస్ – ఐపాస్ తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చడంలో విజయం సాధించిందని ఈ సందర్భంగా, టీఎస్ – ఐపాస్ ద్వారా సాధించిన విషయాల తాలూకు గణాంకాలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు.
తమ ప్రభుత్వ పాలసీల వలన తెలంగాణ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని, భారత దేశ జి.డి.పి కి తెలంగాణ రాష్ట్రం తరఫున గణనీయమైన వాటాను అందిస్తుందని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మంత్రి కేటీఆర్ తన ప్రసంగం తర్వాత ఆయా ప్రతినిధులు వివిధ అంశాలపైన అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటి, లైఫ్ సైన్సెస్, ఫార్మా ,ఏరోస్పేస్ ,డిఫెన్స్, టెక్స్ టైల్స్ , ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా ఎంచుకుని ఆయా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ఉన్న రాష్ట్రాలతోనే కాకుండా ఈ రంగాల్లో దూసుకువెళ్తున్న వివిధ దేశాలతోనూ పోటీ పడేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ , మెడికల్ డివైస్ పార్క్ వంటి అంశాలను ప్రస్తావించారు.
రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఏ వ్యాపార సంస్థకైనా ఆయా కంపెనీ అవసరాల మేరకు, పెట్టుబడి మేరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్న ల్యాండ్ బ్యాంక్ గురించి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు మాత్రమే కాకుండా మానవ వనరుల అభివృద్ధి, వారి శిక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వమే తన ఖర్చుతో శిక్షణ కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఇప్పటికే తెలంగాణలో అమెరికా, జపాన్, కొరియా, చైనా, తైవాన్ వంటి దేశాలకు చెందిన పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, అనేక యూరోపియన్ కంపెనీలు కూడా అత్యంత సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలను తెలంగాణలో కొనసాగిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను వ్యాపార అనుకూలతను ఇక్కడి పెట్టుబడి అవకాశాలను యూరోపియన్ వ్యాపార వాణిజ్య సంస్థలకు తెలియజేసేందుకు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ప్రయత్నించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.