Minister KTR held a review meeting on GHMC led special drive to remove encroachments on footpaths in Hyderabad

26Jul 2018

జిహెచ్ఎంసి చేపట్టిన ఫుట్ పాత్ ల ఆక్రమణల తొలగింపు పై మంత్రి శ్రీ కేటీ రామారావు ఈరోజు సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ , విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్‌ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆక్రమణల తొలగింపును కొనసాగించాలని ఆక్రమణల తొలగింపులో వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలో నిర్ణీత వెండింగ్ జోన్లలతో కూడిన ఒక యాప్ ని తయారు చేయాలని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కోరారు. ఇందుకోసం త్వరలోనే వీది వ్యాపారులతో పాటు సంబంధిత అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ను మంత్రి కేటీ రామారావు ఆదేశించారు.

వ్యాపార ప్రయోజనాల కోసం ఫుట్ పాత్ లపైన శాశ్వత నిర్మాణాలు చేపట్టిన వ్యాపారులు, షాపుల పైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. వీధి వ్యాపారులను ఫుట్ పాత్ ఆక్రమణల పట్ల చైతన్యవంతం చేస్తూ వారిని ప్రత్యేక వెండింగ్ జోన్ లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా జిహెచ్ఎంసి అధికారులు మంత్రికి తెలియజేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్రమణల తొలగింపును ప్రతివారం కొనసాగిస్తామని తెలిపారు.

ఆక్రమణల తొలగింపు తర్వాత ఫుట్ పాత్ ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నూతనంగా నిర్మించే ఫుట్ పాత్ లను అత్యున్నత ప్రమాణాలతో… యూనిఫైడ్ డిజైన్లతో సాధ్యమైనంత మేరకు అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మాణం చేస్తే బాగుంటుందని సూచించారు. నూతనంగా నిర్మించే ఫుట్ పాత్ లకు జోనల్ కమిషనర్లు ప్రత్యేక బాధ్యత వహించాలన్నారు. పదే పదే ఆక్రమణలకు పాల్పడ్డ షాపు యజమానుల ట్రేడ్ లైసెన్సుల రద్దుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.
ఫుట్ పాత్ లపైన ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్లు ఇతర నిర్మాణాల విషయంలో ట్రాన్స్ కో తోపాటు, ఇతర ప్రయివేట్ ఏజెన్సీలకు సైతం నోటీసులు ఇవ్వాలని ఫుట్ పాత్ లపైన వాటి ద్వారా కలిగే అడ్డంకులను అధిగమించి ఏవిధంగా పూర్తిస్థాయిలో రీడిజైన్ చేసుకొని ఆయా సంస్థలను యుటిలిటీస్ ఉంచుకోవాలన్నారు.

ఈ సందర్భంగా నగరంలో నిర్మించ తలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులను వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకొని మూడు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.