MA&UD Minister Sri KTR held a review meeting on various development works taken up in Kodangal constituency. Ministers Sri V Srinivas Goud, Smt Sabitha Indra Reddy, and MLA Sri Patnam Narender Reddy participated in the meeting.
కొడంగల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి – మంత్రి శ్రీ కేటీఆర్
• నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించిన మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీనివాస్ గౌడ్
• హాజరైన వికారాబాద్, నారాయణపేట్ జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా ఉన్నతాధికారులు
• సమావేశానికి హాజరైన వివిధ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు
• ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలి
• భవిష్యత్తులో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలపైన ప్రణాళిక రూపొందించాలని మంత్రుల ఆదేశం
• నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలుగా అండగా ఉంటామని తెలిపిన మంత్రులు
కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ఈ రోజు ప్రగతిభవన్ లో మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి,శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ లతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రీ పట్నం నరేందర్ రెడ్డిలతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల కలెక్టర్ల తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలు అపార నమ్మకంతో టిఆర్ఎస్ పార్టీని గెలిపించారని, వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో వివిధ శాఖల వారీగా చేపడుతున్న, మరియు చేపట్టాల్సిన కార్యక్రమాలపైన విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ఇది ముఖ్యంగా కొడంగల్ పట్టణం, కోస్గి పట్టణాల్లో పురపాలక శాఖ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ రోజు పురపాలక శాఖ అధికారులతో చర్చించారు. దీంతో పాటు వివిధ శాఖల వారీగా అభివృద్ది కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి కేటీఆర్ ముఖ్యంగా మిషన్ భగీరథ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వారీగా ఆయా శాఖల కింద చేపడుతున్న కార్యక్రమాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. టిఎస్ఆర్టిసి ఆధ్వర్యంలో కోస్గి పట్టణంలో బస్టాండ్ తో పాటు బస్ డిపో ఏర్పాటుకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించారు. పురపాలక శాఖ తరఫున టియుఎఫ్ఐడిసి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులతో కోస్గి, కొడంగల్ మున్సిపాలిటీలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా ఈ సమావేశంలో మంత్రులు పురపాలక శాఖా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొడంగల్ లో ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పురోగతి పైన కూడా విద్యాశాఖ అధికారులతో మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో చేపడుతున్న ఎస్టీ హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం, ఎస్సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ పైన సమీక్షించారు. నియోజకవర్గంలో అవసరమైన చోట్ల సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న పనులను మరింత వేగంగా ముందుకు తీసుకుపోవాలని ఆదేశించిన మంత్రులు, నియోజకవర్గ భవిష్యత్ అవసరాల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఒక ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ఈ సమావేశం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, నియోజకవర్గంలో ఉన్న పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక ఎమ్మెల్యే తమ దృష్టికి తీసుకువచ్చిన అన్ని అంశాల్లో ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.