అక్టోబర్ 2 గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా పాటించనున్న పురపాలక శాఖ – మంత్రి శ్రీ కేటీఆర్

14Sep 2020

అక్టోబర్ 2 గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా పాటించనున్న పురపాలక శాఖ – మంత్రి శ్రీ కేటీఆర్
– పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలుకి సంబంధించి ప్రభుత్వం కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తామన్న మంత్రి కేటీఆర్
– అన్ని పట్టణాలు స్వచ్ఛతకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచన
– కార్పొరేషన్ల మేయర్లు, పురపాలికల చైర్మన్లు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
పురపాలక శాఖ తరఫున జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలియజేశారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో తెలంగాణలోని పట్టణాల్లో స్వచ్ఛతకి మరింత ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పట్టణాలను స్వచ్ఛ పట్టణాలుగా తయారు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఈరోజు మంత్రి కేటీఆర్ కార్పొరేషన్ల మేయర్లు, పురపాలక చైర్మన్లు, కమిషనర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వారికి మార్గనిర్దేశం చేశారు. అద్భుతమైన పురపాలక సంస్కరణ అయిన టిఎస్ బీ-పాస్ బిల్లుకు శాసనసభ ఆమోదం లభించిందని త్వరలోనే చట్టంగా మారనున్న టీఎస్ బీ-పాస్ అమలు పైన అందరూ కలిసి రావాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఉన్న అధికారులు, ప్రజా ప్రతినిధులు అంతా కలిసి వస్తే టీఎస్ బీ-పాస్ ద్వారా అద్భుతమైన సేవలు ప్రజలకు అందుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2న పురపాలక శాఖ తరఫున గాంధీ జయంతిని స్వచ్ఛత దినోత్సవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్టోబర్ రెండు నాటికి అక్కడక్కడ పెండింగ్ లో ఉన్న టాయిలెట్ల నిర్మాణం పూర్తి స్థాయి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో తడి, పొడి చెత్త కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగాలని, వేస్ట్ మేనేజ్మెంట్ పైన మరింత దృష్టి సారించాలని సూచించారు. కంపోస్టింగ్, డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటు విషయాల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో ఈ సౌకర్యాలు లేని చోట్ల వాటిని అక్టోబర్ 2 నాటికి పూర్తి అయ్యేలా చూడాలని సూచించారు. పట్టణాల్లో ప్రజల కోసం పారిశుధ్య బాధ్యతలు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్ అందించాలని, వారికి సరైన సమయంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని, వారందరికీ కనీస వేతనాలు అందేలా చూడాలని సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నీ పురపాలికల్లో పెద్దఎత్తున పబ్లిక్ టాయిలెట్లు నిర్మాణం కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఈ లక్ష్యాన్ని అక్టోబర్ 2 నాటికి పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పురపాలికల్లో కలిపి సుమారు వెయ్యికి పైగా నర్సరీలను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆస్తి పన్ను వసూలుకి సంబంధించి ప్రభుత్వం కల్పించిన వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమాన్ని మరో 45 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపిన మంత్రి కేటీఆర్, ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు ఉపయోగించుకునేలా వారిని చైతన్యం చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా పలువురుతో మాట్లాడిన మంత్రి కేటీఆర్, పట్టణాల్లో కొనసాగుతున్న టాయిలెట్ల నిర్మాణం, హరితహారం కార్యక్రమం మరియు వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.