సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునురద్దణకు కృషి చేసిన మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

22Jul 2018

సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు ఎన్సిఎల్టీ (National Company Law Tribunal ) ఆమోదం తెలపడంపై పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు హర్షం వ్యక్తం చేశారు. గత మూడున్నరేళ్లుగా కంపెనీ పునరుద్ధరణ కోసం అనేక ప్రయత్నాలు చేశామని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. గతంలో అహ్మదాబాద్, ముంబై , కోల్ కత్తాతో పాటు అనేక నగరాలకు వెళ్లి ఆయా కంపెనీలు, వివిధ సంస్థల యాజమాన్యాలతో సమావేశం అయ్యామన్నారు. కంపెనీ పునరుద్ధరణ కోసం పారిశ్రామిక సంస్థలతోపాటు కంపెనీకి రుణాలు ఇచ్చిన IDBI ఛైర్మెన్ తోనూ చర్చలు జరిపామన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్ కి అత్యంత కీలకమైన కంపెనీ పునరుద్ధరణ ఎట్టి పరిస్థితుల్లోనైనా జరగాలన్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖతో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. అనేక సంస్థలతో చర్చలు జరిపిన అనంతరం కంపెనీ పునరుద్ధరణకు ముందుకు వచ్చిన జెకె పేపర్ మిల్స్ కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. పారిశ్రామిక విధానంలో భాగంగా జెకె పేపర్ మిల్స్ కి రావాల్సిన పన్నులు, విద్యుత్ రాయితీలు, బకాయిల వసూలు వంటి ఇతర అంశాల పైనా ప్రత్యేకంగా జీఓ 18 ను సైతం విడుదల చేశామని చెప్పారు. పేపర్ మిల్లు పునరుద్దరణతో ప్రత్యేక్షంగా 1200 మందికి, అంతకు మూడురెట్ల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు.
సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన పేపర్ మిల్లు పునరుద్ధరణకు కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు మంత్రి జోగు రామన్న, కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధన్యవాదాలు తెలిపారు. పేపర్ మిల్లు పునరుద్ధరణ ద్వారా మిల్లు కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్న ఆశాభావాన్ని మంత్రి జోగురామన్న వ్యక్తం చేశారు. కంపెనీ మూతపడ్డ తర్వాత దిక్కుతోచకుండ ఉన్న కార్మికుల కుటుంబాలకు ఈ మూడున్నరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందని కోనేరు కోనప్ప అన్నారు. కంపెనీ పునరుద్ధరణ కోసం ఎప్పటికప్పుడు వివిధ కంపెనీలు, రుణదాతలతో మాట్లాడుతూ ముందుండి నడిపించిన మంత్రి కేటీ రామారావు కు సిర్పూర్ కాగజ్ నగర్ ప్రజలు సదా రుణపడి ఉంటారన్నారు. పేపర్ మిల్లు పునరుద్ధరణకు NCLT ఆమోదం తెలిపిన నేపథ్యంలో బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యే కోనప్ప ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.