Sri KTR was given a demonstration on Sewer-Croc and Robotic Camera System which detects blockages in pipelines and clears the same.

5Jun 2018

ఓడిఎఫ్ ప్ల‌స్‌గా మున్సిపాలిటీలు

* బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న ర‌హితంతో పాటు మెరుగైన పారిశుద్ద్యమే ల‌క్ష్యం
* జ‌ల‌మండ‌లి ఆవిష్క‌రించిన నూత‌న‌ సాంకేతిక ప‌రిశీల‌న‌
* ప్ర‌యోగాత్మ‌కంగా కూక‌ట్‌ప‌ల్లి నాలాపై మినీ ఎస్టీపీలు
* 100 ఆవాసాలు ఉన్న అపార్ట్‌మెంట్ల‌కు త‌ప్ప‌నిస‌రి మిని ఎస్టీపీ
* జ‌ల‌మండ‌లి ఎండీని అభినందించిన మంత్రి కేటీఆర్

కేంద్రం ప్ర‌క‌టించిన‌ ఓడిఎఫ్‌ల‌తో సంతృప్తి చెంద‌కుండా ఎడిఎఫ్ ఫ్ల‌స్ గా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల‌ను మారుస్తామ‌ని రాష్ట్ర మున్సిప‌ల్ ప‌రిపాల‌న మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి శ్రీ‌. కె. తార‌క రామారావు గారు తెలిపారు. ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌ల‌మండ‌లి నూత‌నంగా అందుబాటులోకి తీసుకురానున్న రోబోటిక్ సాంకేతిక‌త‌ను రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ‌. అరవింద్ కుమార్, జ‌ల‌మండ‌లి ఎండీ శ్రీ‌. ఎండీ దాన‌కిషోర్ గారితో క‌లిసి మంత్రి తిల‌కించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మాన‌వ ర‌హిత పారిశుద్ద్య ప‌నులు చేప‌ట్టాల‌నే ఉద్దేశ్యంతో కార్మికుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా చూడ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. అందుకే నేడు మ‌నుషులు దిగలేని, దిగ‌కూడ‌ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్య‌వ‌స్థ సాఫీగా సాగేలా రోభోటిక్ టెక్నాల‌జీని నేడు తిల‌కించిన‌ట్లు తెలిపారు. త‌ద్వారా యంత్రాలే మ్యాన్‌హోళ్ల‌లోకి దిగి సెవ‌రెజీ ప‌నులు చేప‌డుతాయని తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం జ‌ల‌మండ‌లి చేప‌ట్టే నూత‌న ప్రాజెక్టు వ్య‌యంలో 0.25 శాతం సెస్ వ‌సూలు చేయ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. వీటిని కార్మికుల సంక్షేమం కోసం, నూత‌న సాంకేతిక ఆవిష్క‌ర‌ణ‌ల కోసం వినియోగిస్తున్న‌ట్లు వివ‌రించారు.

కేంద్రం ప్ర‌క‌టించిన‌ ఓడిఎఫ్‌ల‌తో సంతృప్తి చెంద‌కుండా ఓడిఎఫ్ ఫ్ల‌స్ అనే వినూత్న‌మైన ఈ కార్య‌క్ర‌మం ద్వారా బ‌హిరంగ మల‌విస‌ర్జ‌న ర‌హిత న‌గ‌రంతో పాటు మెరుగైన పారిశుద్ద్య ప‌నులు చేప‌ట్టి ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంత‌మైన సేవ‌లు అందించ‌డ‌మే ఓడిఎఫ్ ప్ల‌స్ ల‌క్ష్య‌మ‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. మున్సిప‌ల్ విభాగంలో నూత‌న సాంకేతిక వినియోగంతో న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.

అలాగే న‌గ‌రంలో కార్మికుల చేత మ్యాన్‌హోళ్ల‌లోకి దిగి పారిశుద్ద్య ప‌నులు చేప‌ట్ట‌కుండా జ‌ల‌మండ‌లి ఆధ్వ‌ర్యంలో 73 మినీ జెట్టింగ్ యంత్రాలు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ సెవ‌రెజీ ప‌నులు చేప‌ట్టే మ‌రో 70 యంత్రాలు అందుబాటులోకి తీసుకువ‌స్తున్న‌ట్లు వివ‌రించారు. మొత్తం 143కి తోడుగా అవ‌స‌ర‌మ‌యితే ఇంకా యంత్రాలు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. ఈ మిని జెట్టింగ్ యంత్రాల ద్వారా సెవ‌రెజీ విభాగంలో విప్ల‌వాత్మ‌క మార్పు వ‌చ్చింద‌ని తెలిపారు. దేశ ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి సైతం ఈ మిని జెట్టింగ్ యంత్రాల‌ను అభినందించారని, ఈ యంత్రాల ప‌నితీరును తెలుసుకుని దేశం మొత్తం ప్ర‌వేశ‌పెట్టే ఆలోచ‌న‌లో ఉంద‌న్నారు.

కొద్ది రోజుల క్రితం దుర‌దృష్ట‌వ‌శాత్తు పైపులైనులోకి దిగి ఇద్ద‌రు కార్మికులు మృత్యువాత ప‌డ‌డం ప‌ట్ల మంత్రి విచారం వ్య‌క్తం చేశారు. స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించి కార్మికులను పైపులైనులోకి దించ‌డం వ‌ల్ల విష వాయువులు పీల్చి కార్మికులు మృతి చెందారని తెలిపారు. ఆ కంపెనీపై చ‌ట్ట‌ప‌రంగా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. భ‌విష్య‌త్‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

అలాగే సీఐపీపీ సాంకేతిక‌త ద్వారా రోడ్డును త‌వ్వ‌కుండానే ఎన్టీఆర్ మార్గ్‌లో శిథిలమైన పైపులైనుకు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం వ‌ద్ద ఏ పైపులైను ఎప్పుడో వేశారో అనే స‌మ‌గ్ర స‌మాచారం లేద‌న్నారు. అందుకే జ‌ల‌మండ‌లి అధికారుల‌ను జీఐఎస్ వ్యవస్తను రూపొందించాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు. దీంతో ఏ పైపులైను ఎక్క‌డ ఉంది, ఎంత కాలం క్రితం వేసింది అనే పూర్తి స‌మాచారాన్ని జీఐఎస్ వ్య‌వ‌స్థ‌లో పొందుప‌రుస్తామని తెలిపారు.

ఎస్టీపీ వ్య‌వ‌స్థ‌ను వికేంద్రిక‌రిస్తామ‌ని తెలిపారు. ఇప్పుడు మూసీ న‌దిపై ఉన్న ఎస్టీపీల‌తో పాటుగా నాలాల‌పై ఎక్క‌డిక‌క్క‌డ మినీ ఎస్టీపీలు నిర్మించ‌నున్న‌ట్లు వివ‌రించారు. ముందుగా 3.2 కిమీల పొడ‌వు ఉన్న కూక‌ట్‌ప‌ల్లి నాలాపై ప్ర‌యోగాత్మ‌కంగా మినీ ఎస్టీపీలు నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని చెరువుల‌ను సంపూర్ణ ప్ర‌క్షాళ‌న కోసం డ్రైనేజీ నీటిని త‌ర‌లిస్తామ‌ని తెలిపారు. 100 ఫ్లాట్ల కంటే ఎక్కువ ఉన్న అపార్ట్‌మెంట్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా మినీ ఎస్టీపీ నిర్మించుకోవాల‌ని సూచించారు. మిని ఎస్టీపీలు నిర్మించే ఆవాసాలు 230 ఉన్న‌ట్లు తెలిపారు. వ‌ర్షాకాలానికి స‌న్న‌ద్ద‌మ‌యినట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు ఉత్ప‌న్న‌మైన ఎదుర్కోవ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు వివ‌రించారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ మ్యాన్‌హోళ్ల మూత‌లు తెర‌వ‌వ‌ద్ద‌ని న‌గ‌ర‌వాసుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

జ‌ల‌మండలి ఎండీ దాన‌కిషోర్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్

జ‌ల‌మండ‌లి ఎండిగా దాన‌కిషోర్ బాధ్య‌త‌లు చేపట్టిన త‌రువాత సంస్క‌ర‌ణ‌లు, ఆవిష్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చార‌ని అభినందించారు. గ్రాండ్ పేరెంట్ అండ్ గ్రాండ్ చిల్డ్ర‌న్ వినూత్న కార్య‌క్ర‌మంలో జ‌లం-జీవం, ఇంకుడు గుంత‌ల‌పై చిన్న‌పిల్ల‌ల‌కు అవ‌గాహాన క‌ల్పించ‌డం ప‌ట్ల జ‌ల‌మండ‌లి ఎండి, అధికారులను మెచ్చుకున్నారు. నూత‌న టెక్నాల‌జీ వినియోగంలో జ‌ల‌మండ‌లి అంద‌రిక కంటే ముందున్న‌ట్లు వివ‌రించారు.