8Mar 2019
భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ
16 ఎంపీలను రాష్ట్రం నుంచి గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు రాబట్టవచ్చు. భువనగిరి ఖిల్లాపైన మాత్రమే కాదు ఎర్రకోటపై కూడా తెలంగాణ జెండా ఎగురవేయాలి. ఢిల్లీ ముందు మనం గులాంలు కావొద్దు. రేపటి రోజున ఢిల్లీ గద్దెపై ఎవరూ నిలవాలో మనమే నిర్ణయించే స్థితిలో ఉండాలి. అప్పుడే అవసరమైన అన్ని పథకాలు మనకు అందుబాటులోకి వస్తాయి.
ఇవాళ ప్రకటించిన 50 కొత్త కేంద్రీయ విద్యాలయాల్లో తెలంగాణకు ఒక్కటి కూడా కేటాయించలేదు. మరోసారి తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపించింది. అటువంటి బీజేపీకి ఎందుకు ఓట్లు వేయాలి. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ తెలంగాణకు మొండి చేయి చూపిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి పని చేయాలని, ఓటేయాలి అని కేటీఆర్ సూచించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఫార్మాసిటీ క్లస్టర్ భువనగిరి నియోజకవర్గంలో ఏర్పాటు కాబోతుంది. జనగామ, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కొత్త పరిశ్రమలు రాబోతున్నాయి. ఆలేరు పరిధి దాతరపల్లిలో ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమలు రాబోతున్నాయి. ఎంఎంటీస్ మార్గం రాయగిరి వద్దకు రాబోతోంది. సాగునీరు తీసుకువస్తాం. ఎస్సారెస్పీ ద్వారా తుంగతుర్తిలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కబోతున్నాయి. తుంగతుర్తిలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తాం. రుద్రమ రిజర్వాయర్ వద్ద సాగునీరిస్తాం. నిజాం హయాంలో కట్టిన మూసీ ప్రాజెక్టు గేట్లను, కాల్వలను అభివృద్ధి చేశాం.
భువనగిరి నియోజకవర్గంలో కృష్ణా, గోదావరి, మూసీ జలాలతో త్రివేణి సంగమం ఏర్పాటు కాబోతోంది. 9 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్ బారిన పడేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ జలాలతో అవస్థలు పడ్డారు. ఫ్లోరైడ్ బారి నుంచి జిల్లా ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టాం. సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు.