9Mar 2019
కొంపల్లిలో నిర్వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
ఈ సమావేశంలో ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మంత్రులు సిహెచ్ మల్లారెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ…
మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం అంటే దేశంలోనే నంబర్‌వన్ పార్లమెంట్. ఇక్కడ భారీ మెజార్టీతో గులాబీ జెండా ఎగరబోతుందన్న విశ్వాసం ఉందన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు తిరుగులేని సమాధానం చెప్పారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో పరిస్థితి లేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలంగాణపై కుట్రలు చేసినవారికి మల్కాజ్‌గిరి నియోజకవర్గం ప్రజలు బుద్ధి చెప్పారు. వ్యవసాయం దండుగన్న చంద్రబాబే.. ఇప్పుడు మన రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తున్నాడు. చంద్రబాబు ఒక్కరే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా రైతుబంధును అమలు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా రైతుబంధును కాపీ కొట్టి పీఎం-కిసాన్ అని పేరు పెట్టి రైతులకు డబ్బులు ఇస్తున్నాడు.
దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. అభివృద్ధి రంగంలో కొత్త నమూనాను తెలంగాణ ఆవిష్కరించింది. అపురూపమైన పథకాలతో తెలంగాణ ప్రజలందరికీ మేలు జరిగేలా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించుకున్నాం. భవిష్యత్‌లో తప్పకుండా ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం లేకుండా ఇంటింటికీ మంచినీళ్లు ఇవ్వబోతున్నాం. యావత్ భారతదేశం మొత్తం కేసీఆర్‌ను ఫాలో అవుతుంది. ఇవాళ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచింది. ఈ ఐదేళ్లలో సెకను కూడా కర్ఫ్యూ విధించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగు అయ్యాయి. సీఎం కేసీఆర్ పరిపాలనను మెచ్చి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. ఓడిపోయిన నాయకులు ఆత్మవిమర్శ చేసుకోకుండా కొందరు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్‌కు ఏం సంబంధం అని బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికలు మోదీకి, రాహుల్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అంటున్నారు. కానీ ఈ ఎన్నికలు తెలంగాణకు అత్యంత కీలకమైనవి. మోదీని కానీ, రాహుల్ కానీ గెలిపించాల్సిన ఖర్మ ఈ దేశ ప్రజలకు లేదు. అద్భుతమైన నాయకులు, అద్భుతమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకే అందరూ జై కొడుతున్నారు. మనం 16 మంది ఎంపీలను గెలిపిస్తే మన హక్కులను సాధించుకోవచ్చు. నిధులను వరదలా తెచ్చుకోవచ్చు. ప్రధాని మోదీ ఈ ఐదేండ్లలో చేసిందేమీ లేదు. మన హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీసే నేతలనే గెలిపించాలి అని కేటీఆర్ స్పష్టం చేశారు.