TRS Working President KTR meeting with TRSMA Association
హైదరాబాద్ జలవిహార్‌లో రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కరస్పాండెంట్స్ & టీచర్ల సమావేశంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీమతి సురభి వాణీదేవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్ లాంటి రోజులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అన్ని బంద్ చేసుకుని ఇంట్లోనే ఉండి ఇబ్బందుల పాలవుతామని అసలే ఊహించలేదు. గతేడాది మార్చిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఒక లక్షా 80 వేల కోట్లు ప్రవేశపెట్టాం. బడ్జెట్ పెట్టిన నాలుగు రోజులకే కరోనాతో సభను అర్ధాంతరంగా ముగించుకున్నాం. కరోనా ఉపద్రవం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దెబ్బతగిలింది. కరోనా వల్ల రాష్ట్రానికి రూ. 52 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. హెలికాప్టర్ మనీ ద్వారా రాష్ర్టాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ సూచించినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మనం కలలో కూడా ఊహించని ఉత్పాతం కరోనా రూపంలో వచ్చిందన్నారు.
తెలంగాణ వచ్చినప్పుడు కొందరు దుష్ర్పచారం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆరున్నరేండ్ల కాలంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాం. విద్యుత్ సమస్యలను అధిగమించాం. మంచి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టే అంగన్‌వాడీ పిల్లలకు బాలామృతం పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు పోయే పిల్లలకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం కడుపునిండా పెడుతున్నాం. గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ద్వారా రాష్ర్ట విద్యార్థులకు విదేశాల్లో విద్యను అందిస్తుందని తెలిపారు. ఆరేళ్లలో లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మరో 50 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ విషయంలో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాలు మాట మార్చాయని కేటీఆర్ అన్నారు